Friday, December 12, 2014

నాద యోగికి నివాళి !

నాద యోగికి నివాళి !
-------
ప|| ఇన్నిచదువనేల ఇంత వెదకనేల | కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||
చ|| పుట్టెడిదొకటే పోయెడిదొకటే | తిట్టమై రెంటికిని దేహమే గురియౌను |
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము | వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||
-------
సద్గురువులు, విద్వాంసులు, కళాకారులు వీరికొక ప్రత్యేకత ఉంది. వీరు మరణించినా వారి వారి చిహ్నాలు ఈ ధరిత్రి మీద మరి కొంత కాలం జీవించి ఉంటాయి. గురువు ద్వారా జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న శిష్యపరంపర గురువు పేరుని బ్రతికిస్తూ ఉంటుంది. త్యాగరాజ స్వామి పరంపర ఉదాహరణ. విద్వాంసుడి విద్వత్తు, కళాకారుడు సృష్టించిన కళాఖండాలు వారిని సజీవంగా ఉంచుతాయి.
సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు సద్గురువు , మహా విద్వాంసుడు & గొప్ప కళాకారుడు.
తెల్లాటి పంచె, లాల్చి , నుదుట విభూది రేఖలు, ముఖాన సరస్వతి కళ , గంభీరమైన గాత్రము చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించే గురువుగారిని కొన్ని సార్లు దర్శించే భాగ్యం నాకు కలిగింది. తాళ్ళాపాక లో జరిగిన అన్నమయ్య 600 వ జయంతి లో ఆయన ఆలపించిన సకల శాఇంతి కరము సర్వేశ కీర్తన పల్లవి నాకు గుర్తు. కర్ణాటక సంగీతంలో తెలుగు వారి కీర్తి పతాకలు చాటిన మహా విద్వాంసులలో నేదునూరి గారు అగ్ర స్థానంలో ఉంటారు. ఆయన నిర్యాణ వార్త విని ఆంధ్ర రాష్త్రంలో కంటే తమిళనాట బాధ పడేవారు ఎక్కువ ఉంటారంటె అతిశయోక్తి కాదు.
కొన్ని వేల కచేరిలు భారతదేశంలో , ఇతర దేశాలలో ఇచ్చి ఎన్నో బిరుదులు పొందిన సంగీత విద్యా భాస్కరుడు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి. ఒకసారి ఇంటర్వూ లో నేదునూరి గారు చెప్పినట్టు గుర్తు , ఇన్ని కచేరీలలో వచ్చిన పేరు కంటే , అన్నమాచార్య కీర్తనలకు ఈయన కూర్చిన స్వరాలు మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అన్నమాచార్య కీర్తనాల మీద స్వతహాగా ఉన్న మక్కువ వలన నాకు, ఆ కీర్తనలకు రాగాన్ని కట్టి ప్రాణం పోసే సంగీతజ్ఞులు అంటే నాకు భక్తి, గౌరవం. ఆ విధంగా నాకు నేదునూరి గారు, సంగీత విద్వాసుడి కంటే , అన్నమాచార్య కీర్తనల స్వర కర్త గా ఎక్కువ పరిచయం. నేదునూరి కృష్ణమూర్తి గారి పేరు తెలియకపోయినా , ఆయన స్వరపరిచిన కీర్తనలు (నానాటి బ్రతుకు, ముద్దుగారే యశోద, భావము లోన, ఇట్టి ముద్దులాడి, ఒకపరికొకపరి, పలుకు తేనెల తల్లి) వినని వెంకన్న భక్తుడు ఉండడేమో ! తమిళనాట పెళ్ళిళ్ళల్లో కూడ నానాటి బ్రతుకు సన్నాయి వాయిస్తూ ఉంటారు. ఈ ఒక్క సంకీర్తన చాలు ఆయన్ని సంగీత కళానిధిని చేయటానికి అని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఒక సభలో అన్నారు. నేదునూరి గారు స్వరపరిచిన 108+ అన్నమాచార్య కీర్త్నలలొ , ప్రతి ఒక్కటి ఒక్కో ఆణిముత్యం. చిక్కటి సంగీతంతో అన్నమయ్య సాహిత్యం లోని భక్తి భావాన్ని, వేంకటేశ్వర తత్వాన్ని కర్ణ రంజకమైన రాగాలలో మనసుకు చేరవేసే విధంగా ఉంటాయి. ఈ సాహిత్యానికి ఇంతకంటె నప్పే స్వర కూర్పు అసాధ్యమనిపించేవిధంగా ఉంటాయి కొన్ని పాటలు. నేదునూరి గారు స్వరపరిచిన కొన్ని కీర్తనలు నా బ్లాగు లో సేకరించాను. ఎమ్మెస్ అమ్మ పాడిన బాలాజి పంచరత్న మాలలో సింహభాగం నేదునూరి గారు స్వరపరిచినవే. స్వర కర్త గా నేదునూరి గారి స్థాయి ని గొప్పదనాన్ని ఆవిష్కరించే మరొక కీర్తన  'తెలిసితే మోక్షము ' నాకు చాలా ఇష్టం.
శరణు శరణు సురేంద్ర సన్నుతరామచంద్రుడితదురామభద్ర రఘువీరసకల శాంతికరమువెనకేదో ముందరేదొఇన్ని చదువానేల , ఆదిదేవ పరమాత్మపలు విచారములేల , పురుషోత్తముడ వీవుతెలిసితే మోక్షము , అవధారు రఘుపతి, అదె చూదరే, అలర చంచలమైన : నేదునూరి గారు స్వరపరిచిన మరికొన్ని సంకీర్తనా కుసుమాలు.

వేంకటేశ్వరుడికి అన్నమయ్య కట్టిన పదాల కోవెల లో , రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గార్లు ప్రాకారాలైతె , పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు , కామిశెట్టి శ్రీనివాసులు గారు నిలబెట్టిన గరుడ ద్వజం నేదునూరి గారు. ఆ ద్వజం మీదున్న 108 సంకీర్తన స్వర దీపాలు అజ్ఞాన తిమిరాలోనున్న భక్తులను ఆకర్షిస్తూ నిజమైన జ్ఞానానికి దారిని చూపిస్తుంటాయి.

మరొక తెలుగు వాగ్గేయకారుడైన భద్రాచల రామదాసు రచించిన కీర్తనలకి స్వరాలు కట్టి గురువుగారు మన తెలుగు జాతి కి వెలకట్టలేని నిధిని ఇచ్చి వెళ్ళారు. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్పూర్థి తో 2006 లో ప్రారంభమైన రామదాసు జయంత్యోత్సవాలు వారి శిష్యులు భద్రాద్రి లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వెబ్సైటు లో నేదునూరి గారు స్వరపరిచిన/పాడిన కొన్ని రామదాసు కీర్తనలు వినవచ్చు. ఈ ఉత్సవాలలో పాల్గొని ఆయన కూర్చిన కీర్తనలు పాడుకోవటం ఆయనకు మనమిచ్చే ఘన నివాళి. ఆయన ప్రాచుర్యం చేసిన ఏమయ్య రామ కీర్తన ఎక్కువగా కచేరిలలో వినిపిస్తూ ఉంటుంది. శ్రీ రామ నామమే, శ్రీరాముల దివ్య నామ, హరి హరి రామ, కంటి నేడు మా రాముల , గురువుగారు స్వరపరిచిన మరికొన్ని ప్రాచురం పొందిన రామదాసు కీర్తనలు.

సంగీత ప్రపంచంలో ఒక ధృవతార భూమిని వదిలి వెంకన్న పాదాల చెంతకు చేరింది. ఆయనకు ప్రదానం చేసిన "సంగీత కళానిధి" కి విలువ పెరిగింది, ఆయనకు దక్కని పద్మాలు , (వి)భూషణాలు కుంచించుకుపోయి మరింత వెలిగే అవకాశాన్ని కోల్పోయినాయి. ఈ కలియుగంలో తిరుమల కొండ పై వేంకటేశ్వరుడి భక్తులు ఉన్నంతవరకు , అన్నమయ్య పదాలు , ఎమ్మెస్ అమ్మ గళం , నేదునూరి స్వరాలు తెలుగునాట ప్రతిధ్వనిస్తూనే ఉంతాయి. ఆ మహాగురువు శిష్యులకు ఆ శైలిని కాపాడి, స్వరాలను ప్రాచుర్యం చేసి భవిష్యత్తరాలకు అందజేసే శక్తిని ఇవ్వాలని ఆ ఏడుకొండల వాదిని ప్రార్ధిస్తూ , నాదయోగికి నమస్కారాలతో వీడ్కోలు.
                                                   || సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ ||

Would like to share the following video here :

Malladi Brothers Tribute to Nedunuri

2 comments:

Anil Piduri said...

ఆయనకు దక్కని పద్మాలు , (వి)భూషణాలు కుంచించుకుపోయి మరింత వెలిగే అవకాశాన్ని కోల్పోయినాయి, ,,,,,,,,,,, correct, baagaa cheppaaru

Unknown said...

great person